Saturday, February 24, 2024
HomeUncategorizedకార్పొరేట్‌, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదం

కార్పొరేట్‌, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదం

ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు కేంద్ర విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలి!---సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని--

 

కార్పొరేట్‌, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదం

అదానీ అక్రమాలపై సమాధానం ఇవ్వడంలో మోడీ విఫలం

ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు
కేంద్ర విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలి!

-సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని-

ఖమ్మం, ఏప్రిల్‌ 22(జనవిజయం): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్‌, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శనివారం ఖమ్మం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యురాలు మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కమిటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్‌ ఆమోదించిందని అన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చలేదని, నిరుద్యోగం తీవ్రంగా వున్నా, తగ్గించే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక యిచ్చినా, దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగలేదన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలు అదానీ`ప్రధాని మధ్య సంబంధంపై సమాధానం యివ్వడంలో మోడీ విఫలమయ్యారని చెప్పారు.

        ఇటీవల యు.పి.లో పోలీసుల ముందే ఓ వ్యక్తిని హత్య చేశారని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడుతున్నాయని, పోలీసుల రాజ్యం నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పాలన సాగుతుందని చెప్పారు. పాఠ్య పుస్తకాల నుంచి గాంధీ, అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను తొలగిస్తున్నారని అన్నారు. వారిని బిజెపి గౌరవించడం లేదన్నారు. లౌకికకతత్వంపై దాడి చేస్తుందని విమర్శించారు. గవర్నర్‌ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు. కేరళలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించే విధానం అమల్లో ఉందన్నారు. డిజిటల్‌ విద్య పేదలకు అందుతుందని వివరించారు. విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేరళ అసెంబ్లీ బిల్లులను పంపినా, గవర్నర్‌ వాటిని ఆమోదించడం లేదన్నారు. తెలంగాణ, తమిళనాడులలోనూ యిదే పరిస్థితి ఉందని చెప్పారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న బి.ఆర్‌.ఎస్‌.తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తమ్మినేని చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. బి.ఆర్‌.ఎస్‌. తప్పులను విమర్శిస్తాం, ఒప్పులను సమర్థిస్తామని అన్నారు. రాష్ట్రంలో బిజెపి బలపడాలని చూస్తోందని చెప్పారు. ఇతర పార్టీల వారిని ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఢల్లీిలో కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియాపై సిబిఐ దాడులు, ఇక్కడ కవిత ఇ.డి. విచారణ అందులో భాగమని చెప్పారు. బిజెపిని అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. మునుగోడు ఎన్నికల్లో బి.ఆర్‌.ఎస్‌.తో కల్సి పనిచేశామని అన్నారు. ఆ తర్వాత తమతో కల్సి పనిచేస్తామంటూ కె.సి.ఆర్‌.ప్రకటించారంటూ గుర్తు చేశారు. బిజెపి వ్యతిరేక పోరాటాన్ని బలపర్చాలని, అందుకే బి.ఆర్‌.ఎస్‌.తో సానుకూలంగా ఉన్నామని చెప్పారు. భవిష్యత్‌లో సీట్ల పొత్తు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 50 వేల మంది గుడిసెలు వేసుకున్నారని అన్నారు. కోరుట్ల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్‌, భూపాలపల్లి ప్రాంతాల్లో గుడిసెవాసులపై పోలీసులు దాడులు చేస్తున్నారని చెప్పారు. గుడిసెలు వేసే ఉద్యమం ఉధృతం చేస్తామని, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తామని అన్నారు. అన్ని జిల్లాల్లో వచ్చే నెలలో సిపిఎం నాయకుల పర్యటనలు వుంటాయని, అవసరమైతే పోలిట్‌బ్యూరో సభ్యులు కూడా పాల్గొంటారని వివరించారు. గుడిసెలకు పట్టాలివ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కానీ ప్రభుత్వం నిర్భంధం మోపుతుందని విమర్శించారు. 58 జి.ఓ. ప్రకారం పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు.

               ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, బండి రమేష్‌, సిహెచ్‌.కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, వై.విక్రం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments