ప్రపంచ విప్లవ మార్గదర్శి లెనిన్.
.. సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు…
ఖమ్మం, ఏప్రిల్ 22(జనవిజయం): ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో, మనిషి తన విముక్తి కోసం సాగించిన ప్రతి విప్లవ పోరాటంలో లెనిన్ మార్గదర్శిగా నిలిచాడని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన లెనిన్ 153వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లెనిన్ తాను జీవించిన 54 సంవత్సరాల కాలంలో నిత్యం పీడిత ప్రజల కోసం ఆలోచించాడని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు అవసరమైన ఒక నూతన సామాజిక వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేశారని తెలిపారు. అందుకోసం అవసరమైన సైద్ధాంతిక కార్యాచరణను, విప్లవ కార్యాచరణను ఆయన రూపొందించారని అన్నారు. వీటి ఆధారంగా విప్లవాన్ని విజయవంతం చేశారని అన్నారు. విప్లవం విజయవంతమైన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన ప్రజా ప్రణాళికలను ఆయన రూపొందించారని తెలిపారు. కేవలం ఒక దేశ విప్లవ కార్యక్రమాన్నే కాక, ప్రపంచంలోని అనేక దేశాల ముఖ్యంగా వలస విముక్తి పోరాటాల కార్యక్రమాలకు లెనిన్ మార్గదర్శిగా నిలిచాడని అన్నారు. లెనిన్ నిర్మించిన తొలి సోషలిస్టు సోవియట్ యూనియన్ దేశం భారతదేశానికి అనేక విధాలుగా సహాయ సహకారాలను అందించిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ముందుకు వస్తున్న విద్వేష రాజకీయాలను ఎదిరించే పోరాటాలలో లెనిన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ లెనిన్‌కు ఘన నివాళి అర్పించింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బండారు రమేష్, మేరుగు సత్యనారాయణ, బండి పద్మ, దొంగల తిరుపతిరావు, మడుపల్లి గోపాల్‌రావు, కొండబోయిన నాగేశ్వరరావు, పి.రaాన్సీ, మాదినేని రమేష్, పి.రమ్య, గుడవర్తి నాగేశ్వరరావు, తాళ్ళపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.