నూతన విద్యావిధానంతో మహిళకు విద్య దూరం
ఖమ్మం, ఏప్రిల్ 20(జనవిజయం)
నూతన విద్యావిధానంతో మహిళలకు విద్య దూరం అవుతుందని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రెసిడెంట్ ఐషీ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం మొత్తం మార్కెట్ అయిందన్నారు. ఈ మార్కెట్ వ్యవస్థలో భాగంగా కోచింగ్ సెంటర్స్ పుట్టుకొచ్చాయని, విపరీతమైన కోచింగ్ సెంటర్స్ రావడం వల్ల ఎడ్యుకేషన్ బాగా కమర్షియల్ అయిందన్నారు. దేశంలో ప్రభుత్వ విద్య అందరికీ అందకుండా పోతుందన్నారు. కొండపల్లి దుర్గాదేవి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె కుమారుడు కోడలు పావన్ , వినత నేతృత్వంలో ఐద్వా ఆధ్వర్యంలో ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ‘నూతన విద్యావిధానం – విద్యార్థినులపై ప్రభావం‘ సెమినార్ లో ఆమె మాట్లాడారు. ముందుగా దుర్గాదేవి చిత్రపటానికి ఐషీ ఘోష్, ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పూలమాల వేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గండ్లూరి కిషన్ రావు సతీమణి నర్సుబాయమ్మను సన్మానించిన అనంతరం ఐషీ ఘోష్ మాట్లాడారు. భారతదేశంలో విద్యాభివృద్ధికి అనేక వనరులున్నాయన్నారు. ఆ వనరులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం, దాని విలువలు ధ్వంసం అవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రాజ్యాంగ హక్కులు హరించివేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్స్, భావప్రకటన స్వేచ్చను హరించే చర్యలు విద్యాసంస్థల్లోకి వస్తున్నాయన్నారు. బీజేపీ విద్యారంగాన్ని పూర్తిగా మతతత్వీకరణ చేస్తుందన్నారు. తదనుగుణంగా సిలబస్ లో మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ రంగ సంస్థలను అముతున్నారని చెప్పారు. భారతదేశ భవిష్యత్తు కు స్థంభాలైన విద్యార్థులే దీనిపై పోరాడాలన్నారు. కొండపల్లి దుర్గాదేవి, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ముందు కెళ్లాలని చెప్పారు. నూతన విద్యావిధానం పేరుతో బిజెపి తెస్తున్న విద్యలో మార్పులు వల్లన మహిళలు విద్యకు దూరం అవుతారని ఐషి ఘోష్ చెప్పారు. ఉన్నత విద్యను పేద విద్యార్ధుల నుండి దూరం చేసేందుకు ఫారిన్ యూనివర్శీటీలను ఆహ్వానిస్తుందని ఆ విద్యాలయాలకు మన దేశ చరిత్ర, అర్ధ శాస్త్రం,రాజకీయ శాస్త్రం తెలుస్తుందా? అని ప్రశ్నించారు.? ఎందుకు పాత విద్యావిధానాన్ని మార్చుతున్నారో కూడా చెప్పలేదని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి విధానాలు తెచ్చి అమలు చేస్తున్నారని వాపోయారు. మహిళలు ముందు లాగా వంట గదికే పరిమితము కావాలని, చదువులు ఆపాలని నూతన విద్యావిధానం పేరుతో సనాతన ధర్మాని మళ్ళీ విద్యావిధానం లోకి తెస్తున్నారని అన్నారు. ఈ దేశ జాతీయోద్యమ నాయకుల చరిత్ర సిలబస్ నుండి తొలగించడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్శీటీలకు ఫండ్స్ ఇవ్వక పోవడం, ఫెలోషిప్స్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడం, బడ్జెట్లో నిధులు పెంచకుండా ఉండటం లాంటివి చేస్తున్నారన్నారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రైవేట్ వ్యక్తులను విద్యలోకీ అనుమతించడం, రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండటం లాంటివి చేస్తున్నారని తెలిపారు. ఇది పాఠశాల విద్యలో డ్రౌఫవుట్స్ పెంచుతుందన్నారు. ఈ డ్రౌఫవుట్స్ పెరగటం అంటే ప్రధానంగా విద్యార్ధినులు చదువుకు దూరం కావడం ఈ విధానానికి వ్యతిరేకంగా విద్యార్ధినులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి మాట్లాడుతూ మూఢచారాలు, మహిళా చైతన్య కోసం కొండపల్లి దుర్గాదేవి ఉద్యమించారన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారని చెప్పారు.ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, బుగ్గవీటి సరళ, అఫ్రోజ్ సమీనా, జిల్లా నాయకురాలు మెరుగు రమణ దుర్గాదేవి కుమారుడు పావన్, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.