భద్రాచలంలో గ్రామ సభ అంతా గందరగోళం!
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు
భద్రాచలం, ఫిబ్రవరి 28(జనవిజయం): డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఈ రోజు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ పొడెం వీరయ్య పాల్గొన్నారు. స్థానిక ఆర్డిఓ , ఎమ్మార్వో , రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మార్వో ప్రసంగిస్తూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు 400కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆ దరకాస్తులను పూర్తిగా పరిశీలించి జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం మొదటి విడతగా అర్హులైన 117 మంది గిరిజనులకు డబల్ బెడ్ రూములు వాటి పత్రాలు అందజేయటానికి ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగు తోందని తెలిపారు. కేవలం గిరిజనుల కే గృహాలు మంజూరయ్యాయని ఎమ్మార్వో ప్రకటించడంతో గ్రామ సభకు వచ్చిన డబల్ బెడ్ రూమ్ దరఖాస్తుదారులు ఒక్కసారిగా అధికారులతో వివాదానికి దిగారు. అర్హులైన అన్ని వర్గాల వారికి గృహాలు అందజేయాలని అధికారులతో గొడవ పడడంతో సభ అంతా గందరగోళం గా మారింది.
అన్ని వర్గాల వారిలో పేదవాళ్లు ఉంటారని కావున దరఖాస్తులు పెట్టిన వారిలో అన్ని వర్గాల వారికి డబల్ బెడ్ రూములు ఇవ్వాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని దరఖాస్తుదారులు అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే , ఆర్డీవో , ఎమ్మార్వో స్పందిస్తూ ఈరోజు జరిగిన విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.