బోనకల్,ఫిభ్రవరి24(జనవిజయం): ఎఫర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బోనకల్ లో మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాల పిల్లలకు శుక్రవారం రోజు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా కార్యక్రమాలను బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ తేజవత్ కవిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, క్రీడలు పిల్లల యొక్క మానసిక, శారీరిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని,క్రీడలు ఆడటం వలన మనిషి ఒక సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటాడని అన్నారు.పోటీలో పాల్గొనుటకు వచ్చిన పిల్లలలో ఎక్కువమంది ఆడపిల్లలు ఉండటం చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. క్రీడలు ఆడే వ్యక్తి ఒక లక్ష్యం కోసం పని చేస్తాడని ఆ విధంగా జీవితంలో తను అనుకున్న స్థాయికి ఎదుగుతారని క్రీడలు ఆడని వ్యక్తి ఎటువంటి లక్ష్యం లేకుండా జీవితంలో స్థిరపడకుండా ఉంటారని ఇలాంటి ఉదాహరణలు చూస్తే మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా ఉన్నాయని అన్నారు.తర్వాత టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలకు మండలంలోని అన్ని స్కూళ్ల నుండి బాలురు, బాలికల జట్లు వచ్చాయి.బాలురకు కబడ్డీ పోటీలను, బాలికలకు ఖో ఖో పోటీలను నిర్వహించడం జరిగింది.సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు చాలా ఉత్కంఠగా సీనియర్ జట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా జరగటం విశేషం. ఈ పోటీలలో బాలికల ఖో ఖో విభాగంలో మొదటి బహుమతిని బోనకల్ హైస్కూల్ కు చెందిన బాలికల జట్టు, రెండవ బహుమతిని ముష్టికుంట్ల హైస్కూల్ కు చెందిన బాలికల జట్టు గెలుపొందడం జరిగింది. కబడ్డీ విభాగంలో మొదటి బహుమతిని ముష్టికుంట్ల హైస్కూల్ కు చెందిన బాలుర జట్టు, రెండో బహుమతిని కలకోట హై స్కూల్ కు చెందిన బాలురు జట్టు గెలుపొందింది. తదనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి బోనకల్ మండల రెవెన్యూ అధికారి సంగు శ్వేత ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఆమె మాట్లాడుతూ స్కూల్ స్థాయి పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన నూతన ఉత్సాహం కలిగి చదువుల యందు ఎంతో ప్రతిభ కనబరచడానికి క్రీడలు దోహదపడతాయని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎఫర్ట్ ఆర్గనైజేషన్ ని అభినందించారు.ఎఫర్ట్ ఆర్గనైజేషన్ బోనకల్ మండలంలో చేపడుతున్న బాలల హక్కుల కోసం పాటుపడుతున్న విధానాన్ని కొనియాడారు.మరో ముఖ్య అతిథి ఎఫర్ట్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే విజయ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే సంస్థ సహకారంతో బోనకల్ మండలంలో బాలల హక్కుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని వాటిలో ముఖ్యంగా బాల్యవివాహాలు నిరోదించడం,బాల కార్మికులు,బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించడం మొదలగు కార్యక్రమాలతో పాటుగా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి వారికి బాలల హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని వీటితో పాటుగా బోనకల్ మండలంలో ముష్టికుంట్ల,బోనకల్,జానకిపురం,గోవిందపురం,కలకోట గ్రామాలలో క్రై సంస్థ ఆధ్వర్యంలో యాక్టివిటీ లెర్నింగ్ సెంటర్ లను స్థాపించి ఈ సెంటర్లలో సాయంత్రం పూట పిల్లల కొరకు వివిధ రకాలైన నైపుణ్యాలకు సంబంధించినటువంటి శిక్షణను తమ సంస్థ అందిస్తున్నట్లు తెలియజేశారు.సీనియర్ పిఈటి సైదేశ్వరరావు మాట్లాడుతూ ఎఫర్ట్ సంస్థ మండల స్థాయిలో ఇలాంటి కార్యక్రమం చేపట్టటం తమకు ఎంతో ఆనందంగా ఉందని అలానే పాల్గొన్న, గెలుపొందిన పిల్లలకు చాలా మంచి బహుమతులను అందించడం వల్ల పిల్లల్లో గెలుపొందాలి అనే ఆసక్తిని మేల్కొల్పిన వారిని అవుతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బోనకల్ మండలానికి చెందిన పీఈటి టీచర్లు శ్రీనివాస్, డి.రవికుమార్, ఎం.మాధవరావు, కే.విష్ణువర్ధన్, ఎస్ శ్రీనివాస్, నాగభూషణం, రవి, సంధ్య, నిర్మల, రేఖాదేవి, సత్యానందం, నారాయణరావు, ఎఫర్ట్ సంస్థ కో ఆర్డినేటర్ సురేష్, సభ్యులు కరుణ, అరుణ, రాణి, నరసమ్మ, గురవమ్మ, స్వాతి, బుజ్జి, పద్మకల, మౌనిక,లాల్ బి,శ్రీనివాస్,రవి,సుమన్ తదితరులు పాల్గొన్నారు.