ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు రాజమార్గం
–రాత్రి పగలు తేడా లేకుండా మండలం వైపుగా అక్రమ రవాణా
-నిద్ర నటిస్తున్న అధికారులు
– పలు అనుమానాలకు తావిస్తుందంటున్న మండల ప్రజలు
బోనకల్, మార్చి 09, (జనవిజయం): ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. ఇసుక, బంగారం రెండు ధరలలో పోటీ పడటంతో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపుతున్నారు.బోనకల్ మండల కేంద్రానికి సరిహద్దు ప్రాంతమైన ఎన్టీఆర్ క్రిష్ణ జిల్లా నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు,అధికారుల అండదండలుండడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా.. అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది.ఆంధ్ర నుంచి తెలంగాణ బోర్డర్ లోకి ప్రవేశిస్తున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే నిద్ర నటిస్తున్నారు.
బోనకల్ మండల కేంద్రంకి అతి దగ్గరలో గల ఎన్టీఆర్ కృష్ణాజిల్లాలోని లింగాల,మంగోల్లు ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు.పట్టపగలే పదుల సంఖ్యలో సామర్థ్యానికి మించి అధిక బరువుతో బోనకల్ మీదుగా లారీలు వెళుతుండడంతో రోడ్డు మార్గం మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి పాడవుతోంది. బోనకల్ నుండి ఖమ్మం రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికుల పట్ల శాపంగా మారింది. పట్టపగలే శరవేగంతో మండల నడికేంద్రం మీదుగా బిందాస్ గా ఇసుక లారీలు వెళ్తున్నారంటే వారికి ఏ స్థాయిలో అధికారుల,రాజకీయనేతల సహాయ సహకారాలు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.ఎటువంటి అనుమతులు లేకుండా మండల కేంద్రం మీదుగా పదుల సంఖ్యలో లారీలు అక్రమ ఇసుకతో వెళుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిద్ర నటిస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది.ఆంధ్ర నేతల అండదండలతో ఖమ్మానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇదంతా నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఆ ప్రజాప్రతినిధి లారీలు ర్యాంపు వద్ద లోడ్ చేసుకున్న నుంచి మొదలై తమ లారీలు గమ్యం చేరేవరకు నాలుగైదు కార్లతో సుమారు 15 మంది సభ్యులు ఇద్దరు ముగ్గురు టీములుగా ఏర్పడి పలుచోట్ల రెక్కీలు నిర్వహిస్తూ తమ లారీలను గమ్యాన్ని చేర్చడానికి ఎంతటికైనా వేనకంజ వేయకుండా బరితెగించి రవాణా చేస్తున్నారు.రాత్రి పగలు మితిమీరిన వేగంతో సామర్థ్యానికి మించిన బరువుతో మండల కేంద్రం వైపుగా వెళ్తున్న అక్రమ ఇసుక లారీలను ఇప్పటికైనా అధికారులు ఛేదించి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.లేనియెడల రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్తానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.