(Palla Kondalarao, Khammam)
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై రివ్యూ రాద్దామనుకుంటుంటే రకరకాల ఆలోచనలు, సంఘర్షణలు మదిలోకి వస్తున్నాయి. అన్నీ ప్రధానమైనవే. చర్చనీయాంశాలే. ఏది ముందుగా వ్రాయాలని అనుకుంటున్నపుడు కే.ఏ.పాల్ గుర్తొచ్చారు. అఫ్కోర్స్ నాకే కాదు, చాలా మందికి కూడా మును‘గోడు’లో కే.ఏ.పాల్ ఏదో ఓ రకంగా గుర్తుకు వస్తున్నారు. 50 వేల మెజారిటీతో తాను గెలుస్తానన్న కే.ఏ.పాల్ మునుగోడు ఉపఎన్నికలలో కేవలం 805 ఓట్లు సాధించారు. కౌంటింగ్ జరుగుతుండగా కేంద్రం నుండి బయటకు వెళుతుండగా మీడియా ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం నా విజయోత్సవ యాత్రకు పోలీస్ అనుమతి కోసం వెళుతున్నానని చెప్పారు. ఓటమి పొందాక ఇ.వి.ఎం లు కాకుండా బ్యాలెట్ పెడితే లక్ష ఓట్లు నావే అన్నారు. తన ఓటమి గురించి బాధ పడొద్దంటూ, డిజప్పాయింట్ కావొద్దంటూ తనకు ఓటేసిన లక్షమంది యూత్, స్టూడెంట్స్, ప్రజలకు ధైర్యం చెపుతున్నానన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు చేసే, చెప్పే విన్యాసాలు, వింతలు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆయన కూడా తన ధోరణి కొనసాగిస్తారు కూడా…… మునగోడు ఎపిసోడ్ ముగిశాక వివిధ పార్టీలు, విశ్లేషణల ద్వారా వస్తున్న కొన్ని కీలక విమర్శలు పరిశీలిద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నామీద పని చేస్తే ముక్కి మూలిగి 10వేల ఓట్లతో టీఆర్ఎస్ గెలిచింది. నైతిక విజయం నాదే. మునుగోడు ప్రజలు నా వెంటే ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజాపా అభ్యర్ధి రాజ్ గోపాల్ ప్రకటించారు. సిద్ధాంతాలు మరచిన కామ్రేడ్లు తమకున్న 30వేల ఓట్ల బలాన్ని దొరకు అమ్ముకున్నారని కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ఎద్దేవా చేసి, ధర్నా చౌక్ లు ఎత్తేసి కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీయార్ ను కేవలం బిజెపిని ఓడించాలన్న ఏకైక ఎజెండాతో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు శాయశక్తులా పనిచేసినా, వేల కోట్లు ఖర్చు చేసినా, ఓటర్లను ప్రభుత్వ పథకాలను అడ్డుపెట్టి బెదిరించినా, ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా స్వల్ప మెజారిటీతో అధికార పార్టీ గెలిచిందని భాజాపా శ్రేణులు అంటున్నాయి.
కేసీయార్ వెంటే తెలంగాణ ప్రజలున్నారని, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పథకాలకు ప్రజలు పట్టం కట్టారని బిజెపికి తెలంగాణలో స్థానం లేదని మునుగోడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ ప్రకటించింది. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకోసం రాజగోపాలరెడ్డి భాజాపా మాటలు విని ఉన్న ఎంఎల్ఏ పదవిని కోల్పోయారని ఎద్దేవా చేస్తున్నారు. ఎం.ఎల్.ఏలను కొనుగోలు చేయడానికి బరితెగించడాన్ని ప్రజలు ఈసడించుకున్నారంటున్నారు. తెలంగాణలోనే కాదు, దేశంలోనూ భాజాపా చిల్లర రాజకీయాలపై పోరాడతామానీ మూడోసారీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఉత్సాహంగా చెప్తున్నారు.
ఇపుడు అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడు కోసం ఉపయోగించినట్లే రేపు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేంద్రప్రభుత్వం మొత్తం ఇప్పటి నుండి పనిచేస్తుందని. 50R (రఘునందన్, రాజేందర్, రాజ్గోపాలరెడ్డి వంటి బలమైన నేతలు) లను చూసుకోగలిగితే, తమలో చేర్చుకోగలిగితే తెరాసను ఓడించే సత్తా భాజాపాకే ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారనీ బిజెపి ఆ పని చేయడంలో వెనుకాడదనీ కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇది ఆలోచించాల్సిన కీలక అంశమే. అంత తేలికగా తీసుకోకూడనిది.
ఇంత క్లిష్టపరిస్థితిలోనూ కోవర్టు రాజకీయాలలోనూ కాంగ్రెస్ కు ఇన్ని ఓట్లు రావడం గమనంలోకి తీసుకోవాలని, సాధారణ ఎన్నికలకూ ఉప ఎన్నికలకూ తేడా ఉంటుందని సాధారణ ఎన్నికలకల్లా ప్రజలు తమను ఆదరిస్తారనడానికిది ఇది సంకేతమని కాంగ్రెస్ నాయకులు ఆశ పడుతున్నారు. కాంగ్రెస్ బ్రతకాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నా రేవంత్ ను పిసిసి ఛీఫ్ గా ఎలా తప్పించాలన్న ధోరణిలోనే కాంగ్రెస్ ఉందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ కుమ్ములాటలు మానకుంటే తెలంగాణలో భాజపానే తెరాసకు ప్రత్నామ్నయంగా ఎదుగుతోందన్నది విశ్లేషకుల భావన. మునుగోడు లో ఓటుకు ఎంత రేటు పలికిందో తెలిసాక, తమకు డబ్బులిస్తేనే ఓటేస్తామని ఓటర్లు బహిరంగంగా చెపుతున్న సందర్భంలో సాధారణ ఎన్నికలలో ఓట్లను కొనుక్కోగల గెలుపు గుర్రాలే కీలకం అన్నది స్పష్టమైనది.
తమవల్లే దేశానికి ప్రమాదకరంగా తయారైన భాజపాను మునుగోడులో తెరాస ఓడించగలిగిందన్నది కామ్రేడ్ల వాదన. తాము సూది,దబ్బనాలం కాదనీ సుత్తీ, కొడవళ్లమని తేల్చామంటున్నారు. ఇకనైనా కేసీయార్ నియంతృత్వ ధోరణి మార్చుకుని ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలంటున్నారు. కామ్రడేడ్లకు కేసీయార్ పై ఆ నమ్మకం ఎలా కలిగింది? కామ్రేడ్ల కోరికని సీఎం మన్నిస్తారా? లేదా? అన్నది భవిష్యత్తులో తేలే అంశం.
ఈ నేపథ్యంలో కమెడియన్ గా చూడబడుతున్న కేఏపాల్ చేసిన ఇతర కమెంట్లను సీరియస్ గా పరిశీలించాల్సి ఉంది. మునుగోడు ఎన్నిక ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎన్నికగా మారిందన్నది నిజం. బీజేపీ 25కోట్లు, టీఆర్ఎస్ 3000 కోట్లు పంపిణీ చేసిందన్నది పాల్ ఆరోపణ. సామాన్యులు ఎన్నికలలో పోటీచేయాలన్న ఆలోచనే రాకపోగా ఓటుకు నాకెంత వస్తాయన్న దిశగా ఆలోచించే దిగజారుడు ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం. ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వ అధికారులు కేసీయార్ కు తొత్తులుగా మారారన్నది ఆయన రెండో ఆరోపణ. అధికారంలో ఉన్నోడికి ఎన్నికల సమయంలో అధికారులు సిగ్గులేకుండా , సిగ్గు పడకుండా సేవ చేయడం ప్రమాదమే. ఎన్నికల సందర్భంగా వేల కోట్లు, మందు, మద్యం, చికెనూ, మటనూ ఏ(బా)రులై పారుతున్నా ఎంతమందిని నిలువరించారు? ఎంత డబ్బు, మద్యం పట్టుబడిందీ లెక్కలు స్పష్టత ఉందా? ఆ సత్తా… అవకాశం అధికార యంత్రాంగానికి ఉందా? అధికారుల అండతోనే డబ్బు, మద్యం పంపిణీ, ఇతరత్రా ప్రలోభాలు, బెదిరింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వింటున్నవే. పాల్ లేవనెత్తిన మరో ప్రశ్న ఇవిఎంల టాంపరింగ్. దీనిపై భిన్నాభిప్రాయాలున్నా అనుమానాలు అధికమే. ఇపుడు బిజెపి కావాలనే టీఆర్ఎస్ కు కొంత మెజారిటీ ఇచ్చిందనీ సాధారణ ఎన్నికలలో ఇవిఎం ల టాంపరింగ్ చేసి భాజపా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పాల్ ఆరోపిస్తున్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అధికారులపై ఓట్ల లెక్కింపులో ఆలస్యం, నిఘాలు పెట్టి ఏం సాధిస్తున్నారు? గుర్తుల కేటాయింపులో లోపాలు, అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా మారుతున్నార్న ఆరోఫణలూ ప్రమాదకరమైనవే. పాల్ ఆరోపణలను సరదాగా కాకుండా సీరియస్ గా తీసుకోవాలి. రానున్న ఎన్నికలలో ఎలా గెలవాలి? ఎవరు గెలవాలి? అన్నదానికంటే ఓటింగ్ సందర్భంగా జరుగుతున్న అవినీతి బంగారుతెలంగాణలో ప్రపంచవ్యాపిత చర్చ కావడం మన వీరతెలంగాణకు అవమానకరం. ఓ సామాన్యుడిగా పోటీ చేసి, ఓడినా ఓటర్లకు ధైర్యం చెప్పి , వ్యవస్థలోని లోపాలను ధైర్యంగా వెల్లడి చేసిన పాల్ ని అభినందించాల్సిందే. పాల్ చేష్టల కంటే ప్రధాన పార్టీల దిగజారుడు హాస్యాస్పదం కావా? ఎందుకు వాటిని హేళనగా, హేయంగా చూడకూడదు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే! కేఏపాల్ చేష్టలు, పార్టీల ప్రవర్తనలూ పోల్చుకుంటే శభాష్! కేఏపాల్ అనాలనిపిస్తోంది .